Visakha Crime : విశాఖలో మహిళ దారుణ హత్య- మేడపై నుంచి తోసేసి, శరీర భాగాలు కోసి!


Visakha Crime : విశాఖలో దారుణం చోటుచేసుకుంది. తగరపువలసలో ఓ వివాహితను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కేరళకు చెందిన ఓలికల్‌ ప్రదీస్‌(37) ఆరేళ్ల కిందట చిప్పాడలోని ఓ కంపెనీలో ఫ్యాబ్రికేషన్‌ పనుల్లో చేరాడు.

ప్రదీస్ కు భార్య, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వీరితో కలిసి తగరపువలస ఆదర్శనగర్‌లో అద్దెకు ఉంటున్నాడు. అయితే గతంలో భార్య ఊరెళ్లినపుడు మరో మహిళతో ప్రదీస్ ఏకాంతంగా గడిపాడు. ఇటీవల భార్యపిల్లలు మరోసారి ఊరు వెళ్లడంతో ప్రదీస్‌ ఆ మహిళకు ఫోన్‌ చేసి ఇంటికి పిలిచాడు. ఆమె ఇంటికి వచ్చాక డబ్బుల విషయంలో ఇద్దరికీ గొడవ జరిగింది. ఆ మహిళ ప్రదీస్ కుటుంబ సభ్యులను దూషించింది. దీంతో మద్యం మత్తులో ఉన్న ప్రదీస్‌ మహిళను భవనంపై నుంచి కిందకి తోసేశాడు. తీవ్రగాయాల పాలైన మహిళను గొంతునొక్కి హత్య చేశాడు.


శరీర భాగాలు కోసి రక్తం పోయేలా చేసి


మద్యం మత్తు దిగాక మహిళ మృతదేహాన్ని తరలించేందుకు ప్రయత్నించిగా... బరువుగా ఉండడంతో తరలించలేకపోయాడు ప్రదీస్. దీంతో మహిళ మర్మాంగాలు సహా శరీర భాగాలను కోసేసి రక్తం బయటకు పోయేలా చేశాడు. ఆ రక్తం మరకలు కనపడకుండా ఇంటి గచ్చుతో మృతదేహానికి ఎర్రని కలర్ పెయింట్ వేశాడు. ఆ తరువాత ఒక నిర్మానుష్య ప్రదేశంలో మహిళ మృతదేహాన్ని పడేశాడు. అక్కడి నుంచి తిరిగి వెళ్తుండగా బైక్ గోతిలో పడిపోవడంతో ఓ మహిళ గమనించింది. అతని బండి నెంబర్ ను సదరు మహిళ పోలీసులకు తెలిపింది. దీంతో ప్రదీస్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోలీసుల విచారణ మహిళ దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. 


నందికొట్కూరులో మహిళ దారుణ హత్య


నందికొట్కూరు మారుతీనగర్‌లో శనివారం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు స్థానికంగా నివాసముంటున్న మలిరెడ్డి రాములమ్మ(35) అనే వివాహితను తన ఇంట్లోనే గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి దారుణంగా హత్యచేశారు. కొత్తపల్లి మండలం ఎర్రమఠం గ్రామానికి చెందిన రాములమ్మకు 20 ఏళ్ల క్రితం పగిడ్యాలకు చెందిన బాలయ్యతో పెళ్లి అయింది. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా ఎనిమిదేళ్ల క్రితం భార్యభర్తలు విడాకులు తీసుకున్నారు. రాములమ్మ మారుతీనగర్‌లో నివాసముంటూ స్థానికంగా ఉన్న బట్టల దుకాణంలో పనిచేస్తుంది. అయితే శనివారం సాయంత్రం గుర్తుతెలియని దుండగులు రాములమ్మను గొంతుకోసి హత్య చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు శనివారం రాత్రి నందికొట్కూరుకు చేరుకుని విచారణ చేపట్టారు. ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.