Magic Mirror: "చెప్పేవాడికి బుద్ధి లేకపోయినా వినేవాడికైనా ఉండాలి కదా" ఇది మనం తరచూ వినే సామెత. ఎదుటి వారు చెప్పేది ఎంత వరకు నిజమో ఓ అంచనాకు రాకుండా గుడ్డిగా వింటే అది మొదటికే మోసానికి వస్తుంది అనడానికి ప్రత్యక్ష ఉదాహరణనే ఈ ఘటన. అద్దంలో చూస్తే నగ్నంగా కనిపిస్తారని.. భవిష్యత్‌ను ముందే అంచనా వేయొచ్చని.. ఓ వృద్ధుడిని నమ్మించారు. అతని వద్ద రూ. 9 లక్షలు కూడా తీసుకున్నారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి వృద్ధుడు ఖంగుతిన్నాడు.

ప్రధానాంశాలు:

  • వృద్ధుడికి భారీ టోకరా వేసిన కేటుగాళ్లు
  • అద్దంలో చూస్తే నగ్నంగా కనిపిస్తారని వెల్లడి
  • రూ.9 లక్షలు తీసుకుని పరారైన దుండగులు



Magic Mirror: పురాతన వస్తువులు, మ్యాజిక్ కలిగిన వస్తువులు అంటూ మోసం చేసేవారు చాలా మంది ఉంటారు. అయితే వారు చెప్పినవన్నీ నమ్మి డబ్బులు ఇస్తే ఇక మరిచిపోవాల్సిందే. ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినా కొంతమంది మాత్రం అలాగే చేస్తూ ఉంటారు. తాజాగా ఓ వృద్ధుడు కూడా ఇలాగే మోసపోయి చివరికి పోలీసులను ఆశ్రయించాడు. కొంతమంది దుండగులు.. తనకు మ్యాజిక్ మిర్రర్‌ గురించి చెప్పారని.. అందులో చూస్తే మిగితా వారు నగ్నంగా కనిపిస్తారని.. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో ముందే గ్రహించవచ్చని నమ్మించారని చెప్పాడు. అది నమ్మిన తాను వారికి డబ్బు ఇచ్చి మోసపోయానని.. తిరిగి ఇవ్వమని అడిగితే వారు ఇవ్వడం లేదని పేర్కొన్నాడు.

ఉత్తర్‌ప్రదేశ్‌ కాన్పూర్‌కు చెందిన 72 ఏళ్ల అవినాష్ కుమార్ శుక్లాను ముగ్గురు నిందితులు మోసం చేసి.. అతని నుంచి రూ.9 లక్షలు కొట్టేశారు. ముగ్గురు వ్యక్తులను పశ్చిమ బెంగాల్‌కు చెందినవారిగా గుర్తించారు. పురాతన వస్తువులను సేకరించే ప్రముఖ సింగపూర్ సంస్థకు చెందిన ఉద్యోగులమని చెప్పి ఆ ముగ్గురూ తనను నమ్మించారని పోలీసులకు అవినాష్ కుమార్ శుక్లా వెల్లడించాడు. తనకు మ్యాజిక్ మిర్రర్ గురించి చెప్పారని.. అందులో చూస్తే మిగితా వారు అందరూ నగ్నంగా కనిపిస్తారని చెప్పారని తెలిపాడు. అంతే కాకుండా ఆ మ్యాజిక్ మిర్రర్‌లో చూసి భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చెప్పేయొచ్చు అని కూడా తనకు చెప్పారని వివరించాడు.