గుజరాత్‌కు చెందిన కొందరు ఉత్తరాది రాష్ట్రాల్లో తీర్థ యాత్రల కోసం ట్రావెల్స్ బస్సుతో వెళ్లి.. ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. వారు ప్రయాణిస్తున్న బస్సు.. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ సమీపంలో ప్రమాదానికి గురయ్యింది. బస్సులో ఇంధనం పూర్తిగా ఖాళీ కావడంతో అది ఓ చోట ఆగిపోయింది. ఈ క్రమంలో బస్సు నుంచి కొందరు కిందకు దిగి నిలబడ్డారు. అదే సమయంలో ఓ భారీ వాహనం వెనుక నుంచి వచ్చి ఆ బస్సును ఢీకొట్టింది.

ప్రధానాంశాలు:

  • బస్సులో తీర్థయాత్రలకు వెళ్లిన గుజరాత్ వాసులు
  • రాజస్థాన్‌లోని పుష్కర్ నుంచి వస్తుండగా ప్రమాదం
  • ఘటనా స్థలిలోనే 11 మంది యాత్రికులు మృత్యువాత



రాజస్థాన్‌లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. భరత్‌పూర్ సమీపంలోని జాతీయ రహదారిపై ఆగి ఉన్న బస్సుపైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కనీసం 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 12 మంది గాయపడ్డారు. బుధవారం ఉదయం 4.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ బస్సు రాజస్థాన్‌లోని పుష్కర్ నుంచి ఉత్తర్ ప్రదేశ్‌లోని వ్రిందావన్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఓ వంతెన సమీపంలోకి వచ్చేటప్పటికి ఇంధనం లేక బస్సు ఆగిపోయి సమయంలో ఈ దుర్ఘటన జరగడం గమనార్హం.

ప్రమాదం నుంచి బయటపడి బాధితుల కథనం ప్రకారం.. ట్యాంకులో ఇంధనం పూర్తిగా అయిపోవడంతో బస్సు ఆగిపోయింది. దీంతో డ్రైవర్, కొంత మంది ప్రయాణికులు కిందకు దిగి వాహనం పక్కన నిలబడ్డారు. ఈ సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న ఓ ట్రక్కు బస్సుపైకి దూసుకొచ్చింది. లఖన్‌పూర్ ప్రాంతంలోని అంత్రా ఫ్లైఓవర్ వద్దకు వచ్చేసరికి ఫ్యూయల్ అయిపోవడంతో బస్సును డ్రైవర్ పక్కకు తీసి నిలిపాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో భారీ ట్రక్కు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టిందని చెప్పారు.

ఘటనా స్థలంలోనే 11 మంది చనిపోయారని, మరో 12 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారని తెలిపారు. బాధితులను గుజరాత్‌కు చెందినవారిగా గుర్తించారు. ట్రావెల్స్ బస్సులో వీరంతా ఉత్తర భారతంలో తీర్ధయాత్రల కోసం వచ్చినట్టు చెప్పారు.

రాజస్థాన్‌లోని పుష్కర్‌లో ఉన్న బ్రహ్మ ఆలయాన్ని సందర్శించుకుని.. యూపీకి వెళ్తుండగా ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాదం గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.