Crime: పెళ్లి కాకముందే ఓ యువతి గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసి యువతి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఎక్కడ పరువుపోతుందోనని బయపడ్డారు.

చివరికి కూతురుని ఊరికి దూరంగా ఉన్న అడవికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని హాపుడ్ జిల్లాలో జరిగింది.

నవాడా కుర్డ్ గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువతి అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు కొద్దిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో వాళ్లకి తెలియకుండా చట్టా పట్టాలేసుకొనిన తిరిగారు. పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో వారిద్దరి శారీరకంగా దగ్గరయ్యారు. దీంతో సదరు యువతి గర్భం దాల్చింది. ముందు ఈ విషయాన్ని ఇంట్లో తెలియకుండా యువతి జాగ్రత్త పడింది.

చివరికి యువతి ఇంట్లో గర్భందాల్చిన విషయం తెలియడంతో ఆమె తల్లి, సోదరుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఊర్లో, బంధుమిత్రులకు తెలిస్తే పరువు పోతుందని బయపడ్డారు. ఈక్రమంలో సదరు యువతిని తల్లి, సోదరుడు ఇంటి వద్ద చితకబాదారు. ఆ తర్వాత ఊరుకు దగ్గర్లో ఉన్న అడవికి తీసుకెళ్లారు. అనంతరం తమ వెంట తీసుకెళ్లిన పెట్రోల్ తీసి యువతిపై పోశారు. ఆ సమయంలో యువతి ఎంత బతిమిలాడినా కూడా వారు పట్టించుకోలేదు. పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు.

అయితే నిప్పు పెట్టడంతో సదరు యువతి అరుపులు, కేకలు వేయడంతో స్థానికులు గమనించి ఆమెను కాపాడారు. మంటలు ఆర్పేసి.. దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే యువతి 70 శాతం కాలిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి క్రిటికల్‌గా ఉందని.. చికిత్స కొనసాగిస్తున్నామని తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. తల్లి, సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు.